ట్రాయ్ చైర్మన్ కు మరో షాక్!

వాస్తవం ప్రతినిధి: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ ఆర్‌ఎస్ శర్మకు మరో షాక్ తగిలింది. తన ఆధార్ నంబర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసి తనకు ఎలాంటి హాని కలుగుతుందో చూద్దామంటూ సవాలు విసిరిన ఆయనకు హ్యాకర్లు తిమ్మతిరిగే విధంగా ఆయన మొబైల్ నంబర్,పాన్ కార్డ్.ఇంటి అడ్రస్ తో సహా అన్ని వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనితో షాక్ తిన్న ఆయన మళ్లీ ఇలాంటి సవాల్ చేయకూడదు అని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో మరో షాక్ తిన్నారు. తాజాగా మరో హ్యాకర్ ఆయన ఆధార్ నంబర్‌ను ఉపయోగించి భీమ్ మొబైల్ యాప్ ద్వారా ఆర్‌ఎస్ శర్మ అకౌంట్‌లో రూపాయి జమ చేశాడు. యూజర్ల ప్రైవసీని కాపాడటానికి ఓ మంచి వ్యవస్థను నిర్మించండి. దాని కోసం నా విరాళం ఈ రూపాయి అంటూ అతడు ట్వీట్ కూడా చేశాడు. యూపీఐ ద్వారా అవతలి వ్యక్తి అనుమతి లేకుండా అతని ఆధార్ నంబర్ తెలిస్తే చాలు వాళ్ల అకౌంట్‌లో డబ్బులు వేసేయొచ్చు. ఇప్పుడిదే విషయాన్ని సదరు హ్యాకర్ నిరూపించాడు. ఆయన తన ఆధార్ నంబర్‌ను బయటకు చెప్పడం వల్ల ఆర్‌ఎస్ శర్మకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నట్లు తేలింది అని ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు. అంటే ఆయన అనుమతి లేకుండానే రూపాయి లంచాన్ని ఆయన పొందారు. ఆయనపై లంచం తీసుకున్న కేసు వేయాలి అంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు. మొత్తానికి ఆధార్ నంబర్ బయటపెట్టి సవాలు విసిరిన ట్రాయ్ చైర్మన్.. అదెంత ప్రమాదకరమో తెలుసుకున్నారు. ఇప్పుడాయన వివరాలన్నీ బట్టబయలయ్యాయి. ఇదే విషయంపై ఎప్పటి నుంచో చాలా మంది ఆందోళన వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే.