చెన్నై నగరమంతా హై అలర్ట్.. ఆసుపత్రి నుంచి కరుణానిధి నివాసం వరకు పోలీసుల మొహరింపు

వాస్తవం ప్రతినిధి: చెన్నై కావేరీ ఆసుపత్రిలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి కరుణానిధి ఆరోగ్యం విషమించింది. కావేరి ఆస్పత్రి వైద్య బృందం విడుదల చేసిన హెల్త్‌బులిటెన్‌లో కరుణానిధి ఆరోగ్యం కొద్ది సమయం విషమించినా.. నిపుణులైన వైద్యబృందం పర్యవేక్షణలో ఆయనకు మెరుగైన చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. అయితే కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నై నగరమంతా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆసుపత్రి నుంచి కరుణానిధి నివాసం ఉన్న గోపాలపురం వరకు దారి పొడవునా పోలీసులను మోహరించారు. పోలీసులకు ఉన్నతాధికారులు సెలవులను రద్దు చేశారు. ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అదనపు బలగాలను కూడా సిద్ధం చేశారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రమంతటా భద్రతను ఏర్పాటు చేశారు.
కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సేలంకు వెళ్లిన పళనిస్వామి, నేటి అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని చెన్నై వచ్చారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న ఆయన, హుటాహుటిన వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఐసీయూలో ఉన్న కరుణానిధిని చూసి వచ్చిన పళనిస్వామి, ఆసుపత్రి వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.