ఉత్తర ప్రదేశ్ లోని ఓ రెస్టారెంట్ లో కాల్పుల కలకలం

వాస్తవం ప్రతినిధి: ఉత్తరప్రదేశ్‌ లో ఒక రెస్టారెంట్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. యూపీ  సుల్తాన్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఫుడ్‌ పార్సిల్‌ నేపథ్యంలో వెయిటర్‌తో చోటుచేసుకున్న గొడవ  యజమాని హత్యాయత్నానికి దారి తీసింది. రోజులానే అవంతికా రెస్టారెంట్‌ ఆదివారం జనాలతో సందడిగా ఉంది. అయితే ఈ క్రమంలో హోటల్‌ క్యాష్‌ కౌంటర్‌ వైపు సాదా సీదాగా నడుచుకుంటు వచ్చిన ఓ వ్యక్తి తుపాకీతో యజమాని అలోక్‌ ఆర్యాపై కాల్పులు జరిపాడు. డ్రామాను తలపించిన ఈ ఘటనతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సాదా సీదా గా కౌంటర్ వద్దకు వచ్చిన ఆ వ్యక్తి చడీ చప్పుడు లేకుండా మూడు రౌండ్ల కాల్పులు జరిపి మెల్లిగా జారుకున్నాడు. దీనితో వెంటనే తేరుకున్న హోటల్ సిబ్బంది అలోక్ ను సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతనో ప్రయివేట్‌ కాంట్రాక్టర్‌ అని, పార్సిల్‌ విషయంలో వెయిటర్‌తో అతను గొడవపెట్టుకోగా .. యజమాని ఆర్యా జోక్యం చేసుకుని అతన్ని శాంతింపచేసే ప్రయత్నం చేశాడని దానిని మనసులో పెట్టుకున్న నిందితుడు మళ్లి తన ఇద్దరి స్నేహితులతో కలిసి  రెస్టారెంట్‌కు వెళ్లి కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.