ఆడపడుచులు సంతోషంగా లేరు .. భవిష్యవాణిలో అమ్మవారు ఆగ్రహం

Hyderabad july 14th 2014; Rangam (foretelling the future) by Swarna Latha held at Ujjaini Mahankali temple on the occasion of Bonalu Monday.

వాస్తవం ప్రతినిధి: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉదయం ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు అడిగే ప్రశ్నలకు స్వర్ణలత సమాధానం చెప్పారు.ఈ సంవత్సరం బంగారు బోనాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేసిన ఆలయ ప్రధాన పూజారి, సంతృప్తి చెందావా అమ్మా? అని ప్రశ్నించగా, స్వర్ణలత నా బోనాన్ని నాకు సమర్పించి సంతృప్తి చెందావా? అని ప్రశ్నించడం ఏంటని, ఈ సంవత్సరం ఉత్సవాలు తనకు సంతోషాన్ని కలిగించలేదని వ్యాఖ్యానించింది. ఇంత ఘనంగా ఉత్సవాలు చేస్తే… సంతోషం లేదని ఎలా చెబుతావమ్మా? అని అడుగగా, తనను ప్రశ్నించడానికి నువ్వెవరని అమ్మ గద్దించేవరకు అక్కడున్న భక్తులంతా నివ్వెరపోయారు.

తన భక్తులకు సంతోషం లేకుండా పోయిందని, ప్రతియేటా ఆనందంగా తన వద్దకు వచ్చే భక్తులు, ఈ సంవత్సరం బాధతో వస్తున్నారని భవిష్యవాణిని వినిపిస్తూ, స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆలయానికని వచ్చిన ఆడపడుచులు శోకిస్తూ వెళుతున్నారని, ఈ సంగతిని ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.  సంతోషం లేదంటే తామంతా ఏమై పోవాలని ప్రశ్నించగా, “నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయిరా బాలకా… ఏం మాట్లాడుతున్నావురా బాలకా నువ్వు? ప్రత్యక్షంగా నీ కళ్లతో చూసి చెప్పు” అంటూ గద్దించింది. అమ్మ మనసులోని కోరికేంటో చెప్పాలని కోరగా, తన ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత తనదని, మీరు మాత్రం ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలని ఆదేశిస్తూ, అదే తన కోరికని చెప్పింది . ఆపై ఏమైనా తప్పులు ఉంటే దిద్దుకుంటామని, ఆ అవకాశం తమకు ఇవ్వాలని పూజారి వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా తెలంగాణ ఆడపడుచులు ఆలయానికి చేరుకుని బోనాలను అమ్మవారికి సమర్పించుకున్నారు.