ఆగస్టు 14 లోగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం

వాస్తవం ప్రతినిధి: ఆగస్టు 14 లోగా ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) పేర్కొంది. ఇటీవల పాక్ లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ విజయాన్ని సాదించిన సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14లోగా  ఆయన ఆ దేశ ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ పేర్కొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చిన్నపార్టీలు, స్వతంత్రులతో ఆ పార్టీ చర్చలు జరుపుతోంది. ఈ నెల 25న జరిగిన పాకిస్థాన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో పీటీఐ.. 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 172 మ్యాజిక్ ఫిగర్ ని సాదించలేక పోయింది. దీనితో ఇతరుల మద్దతు కావాల్సి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు  చర్చలకు దిగాయి. పాకిస్థాన్‌లోని రెండు ప్రధాన పార్టీలైన పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌లు కొద్దిరోజుల్లో సమావేశమై, ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే అవకాశం ఉంది. పార్లమెంటులో పీటీఐని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. పీటీఐకి జీడీఏ, ఎంక్యూఎం-పీ, పీఎంఎల్‌-క్యూ, అవామీ ముస్లిం లీగ్‌ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఇమ్రాన్‌ పార్టీకి మద్దతు 122కు పెరిగింది.