మెహుల్ చోక్సీ ఆంటిగ్వా వదిలి పారిపోకుండా చూడాలని కోరిన భారత్

వాస్తవం ప్రతినిధి: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుల్లో ఒకడైన మెహుల్ చోక్సీ ప్రస్తుతం కరీబియన్ దేశమైన ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల వ్యాపార విస్తరణ కోసం ఆయన ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు అతడు చెప్పిన సంగతి తెల్సిందే.  ఈ నేపధ్యంలో ఇప్పుడతను దేశం వదలి పారిపోకుండా చూడాలని ఆంటిగ్వాను ఇండియా కోరినట్లు తెలుస్తుంది. అతను ఆంటిగ్వాలోనే ఉన్నాడని తెలియగానే జార్జ్‌టౌన్‌లోని భారత హైకమిషన్ అక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. మెహుల్ చోక్సీని తమకు అప్పగించాల్సిందిగా అక్కడి ప్రభుత్వాన్ని భారత రాయబారి కోరారు. మెహుల్ చోక్సీ భూ, సముద్ర, వాయు మార్గాల్లో దేశం వదిలి వెళ్లకుండా నిర్బంధించండి అని ఆ లేఖలో కోరినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మెహుల్ పాస్‌పోర్ట్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతనిపై ఈ కేసులన్నాయని తెలిస్తే అసలు తమ దేశ పౌరసత్వమే ఇచ్చేవాళ్లం కాదని అక్కడి ప్రధాని చెప్పడం గమనార్హం.