అక్రమ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కేసులో వారిద్దరూ విచారణ ఎదుర్కోవాల్సిందే: సుప్రీం కోర్టు

వాస్తవం ప్రతినిధి: అక్రమ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. 2004-06లో భారత టెలికాం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దయానిధి మారన్‌ చెన్నైలోని తన ఇంటిలో అక్రమ టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి 1.78 కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వీరిద్దరూ విచారణ ఎదుర్కొనాల్సి వచ్చింది.  ” మీ సోదరుడి టీవీ కోసం మీరు ఫోన్లను ఉపయోగించారని ఆరోపణ ఉంది, మీరు విచారణను ఎదుర్కొంటున్నారు” అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ కేసు నుండి తమకు ఉపసమనం కలిగించాలని దయానిధి మారన్‌ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరిస్తూ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. గత వారం, దయానిధి మారన్‌, సన్‌ గ్రూపునకు నాయకత్వం వహించిన ఆయన సోదరుడు కళానిధి మారన్‌కు వ్యతిరేకంగా 12 వారాల్లోగా చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత మార్చిలో ఈ కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరినీ ప్రత్యేక సిబిఐ కోర్టు ఉపశమనం కలిగించింది. ఈ క్రమంలో ప్రత్యేక సిబిఐ కోర్టు జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టు తెలిపింది.