హిమదాస్ కోచ్ పై లైంగిక ఆరోపణలు….చిక్కుల్లో పడ్డ కోచ్!

వాస్తవం ప్రతినిధి: హిమదాస్ రూపంలో దేశానికి అద్భుత ప్రతిభ కల్గిన అథ్లెట్‌ను పరిచయం చేసిన కోచ్ నిపన్‌దాస్ చిక్కుల్లో పడ్డాడు. ఆయన దగ్గర శిక్షణ పొందిన ఒక క్రీడాకారిణి ఆయనపై లైంగిక ఆరోపణలు చేసి ఆయనని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర రాజధాని గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఎంతో మంది అథ్లెట్లను నిపన్‌దాస్ తీర్చిదిద్దాడు. అయితే మే నెలలో తనను లైంగికంగా బాధించాడని ఆరోపణలు చేస్తూ గత నెల 22న సదరు క్రీడాకారిణి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిపన్‌పై ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనిపై అతను శనివారం మీడియాతో స్పందిస్తూ ఆమె చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, కల్పితమైనవి. ఆమె కంటే వేగంగా పరిగిత్తే అథ్లెట్లు నా దగ్గర శిక్షణ పొందుతున్నారు. జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టులో చోటు దక్కని కారణంగానే ఆమె అసత్య ఆరోపణలు చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణ కొనసాగుతున్నదని, నాతో పాటు సహాయక కోచ్‌లు, కొంత మంది అథ్లెట్లను వారు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో ఎలాంటి మచ్చలేకుండా బయటపడుతానన్న నమ్మకం నాకుంది అని నిపన్ అన్నాడు.