లూలా ను తక్షణమే విడుదల చేయాలి: అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు

వాస్తవం ప్రతినిధి: బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వాను తక్షణమే విడుదల చేయాలని బెర్నీ శాండర్స్‌తో సహా 29మంది అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు కోరారు.  ఈ మేరకు సెనెటర్‌, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసిన బెర్నీ శాండర్స్‌తో సహా 29మంది బ్రెజిల్‌ రాయబారి సెర్గియో అమరల్‌కు లేఖ రాశారు. లూలాను అరెస్టు చేసి జైల్లో పెట్టడం తీవ్ర అభ్యంతరకరమైన అంశమని, రాజకీయ దురుద్దేశంతో కూడినదని వ్యాఖ్యానించారు వారు ఆయనని విడుదల చేయాలని కోరుతా లేఖ రాసినట్లు తెలుస్తుంది. అవినీతిపై పోరును రాజకీయ ప్రత్యర్థుల వేధింపులను సమర్ధించుకోవడానికి ఉపయోగించరాదని ఆ లేఖలో కోరారు. వారు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనేందుకు గల హక్కును నిరాకరించరాదన్నారు. అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ లూలాపై వచ్చిన అభియోగాలన్నీ నిరాధారమైనవేనన్నారు. నల్ల జాతి కార్యకర్త హత్య, రియో డీ జెనీరో నగర కౌన్సిల్‌ సభ్యురాలు మారెల్లా ఫ్రాన్స్కో హత్యల్లో భద్రతా బలగాలు ఆయన్ని తప్పుగా ఇరికించి వుండవచ్చునని వారు అన్నారు. ప్రస్తుత బ్రెజిల్‌ అధ్యక్షుడు మైఖేల్‌ టెమర్‌ మితవాద భావజాలం కలిగినవారని, బ్రెజిల్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై దాడులు ఉధృతమైన తరుణంలో టెమర్‌ ప్రభుత్వాన్ని నెలకొల్పారని వారు విమర్శించారు.