రాష్ట్రంలో న్యాయం అడిగిన వారిపై రౌడీషీట్లు పెడుతున్నారు: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో న్యాయం అడిగిన వారిపై రౌడీషీట్లు పెడుతున్నారని, రైతులను పరామర్శించడానికి వెళితే తనను పోలీసులు ఎత్తుకుపోయి అరెస్ట్‌ చేశామని చెప్పే పరిస్థితులు దాపురించాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ‘2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు’ జరిగింది. ఈ సదస్సూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్‌ సీలింగ్‌ ద్వారా వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్న దళితులు, పేదల భూములను ప్రభుత్వం లాక్కుని పరిహారం ఇవ్వడం లేదన్నారు. పట్టా భూమిగల రైతులకు ఏ తరహా పరిహారం ఇస్తున్నారో అసైన్డ్‌ భూములు సాగు చేసే దళితులకు కూడా అదే పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జనసేనతో కలిసి ప్రభుత్వంపై ఐక్యంగా పోరాటడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, సిఎం చంద్రబాబు పొలాలను బీళ్లుగా మారుస్తూ సింగపూర్‌ కంపెనీలకు కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు. రాజకీయంగా మార్పు రావాలని, ఆ మార్పు కోసం జనసేనతో కలిసి వామపక్షాలు పోరాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించి కలిసికట్టుగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.