నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

వాస్తవం ప్రతినిధి: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ విహర యాత్రకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ టోలీచౌకీ ప్రాంతానికి చెందిన ఐదు కుటుంబాలు విహార యాత్రకు నాగార్జున సాగర్ కు బయలు దేరారు. మార్గమధ్యలో నసర్లపల్లి వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బస్టాండ్ గోడను ఢీకోట్టింది. వెనుక వస్తున్న వాహనాల్లోని వారు వెంటనే స్పందించి వారిని బయటకు తీశారు. అప్పటికే నలుగురు ప్రాణాలు విడిచారు. మిగిలిన వారిని వెంటనే హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు.

మృతులను హైదరాబాద్ టోలీచౌక్‌కు చెందిన ఎం.డి.మోహిన్, తమ్ము, ముస్తాఫా, సద్దాం, అక్తర్‌, ఆషాగా గుర్తించారు. మూడు వాహనాల్లో ఐదు కుటుంబాలు విహార యాత్రకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .