దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి!

వాస్తవం ప్రతినిధి: శశికళ మేనల్లుడు, ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ ఇంటిపై ఆదివారం మధ్యాహ్నం పెట్రోల్‌ బాంబు దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా ఓ కారు ధ్వంసమైనట్లు తెలుస్తుంది.అయితే ప్రమాద సమయంలో దినకరన్ కారులో లేకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పినట్లు సమాచారం. గతేడాది తమిళనాడులోని అర్కే నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. అయితే ఇటీవల దినకరన్ బుల్లెట్‌ పరిమళం అనే వ్యక్తిని పార్టీ నుంచి తొలగించారు. దీంతో దినకరన్‌పై పగ పెంచుకున్న పరిమళం.. ఆయన ఇంటిపై పెట్రోల్‌ బాంబు విసిరాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపధ్యంలో బాంబును కారులో తీసుకుని ఈరోజు మధ్యాహ్నం దినకరన్‌ ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. అయితే ఆ సమయంలోనే పెట్రోల్‌ బాంబు అదే కారులో పేలిపోయింది. ఈ ఘటనలో దినకరన్‌ కారు డ్రైవర్‌, వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌ డార్వన్‌తో పాటు ఓ ఆటో డ్రైవర్‌ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బుల్లెట్‌ పరిమళం కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు బుల్లెట్‌ పరిమళం కోసం గాలిస్తున్నారు.