జగన్ పాదయాత్ర@ 223వ రోజు

వాస్తవం ప్రతినిధి: ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 223వ రోజుకు చేరుకున్నది. ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జగన్ పాదయాత్ర ప్రారంభించారు. జగ్గంపేట నుంచి రామవరం, గొనేడ, రామచంద్రాపురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. జగన్ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు వచ్చి తమ సమస్యలను విన్నవించుకొంటున్నారు.
కాగా, శనివారం జరిగిన యాత్రలో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దని తెలిపారు. తొందరపడి ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, అందరం కలసి పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని చెప్పారు. స్పెషల్ స్టేటస్ కోసం చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన చేనేత కార్మికుడు సుధాకర్ (26) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని ఆయన అన్నారు. బతికుండి పోరాడి తమ హక్కులను సాధించుకుందామని చెప్పారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.