గుజరాత్ లో మరో మూక దాడి…ఒకరు మృతి!

వాస్తవం ప్రతినిధి: మూక దాడుల ను నిరోధించడడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాలని ఇటీవల కోర్టులు ఆదేశించినప్పటికి ప్రభుత్వాలు మాత్రం దాడులను అరికట్టలేకపోతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని దాహోడ్ జిల్లాలో ఇద్దరు గిరిజన యువకులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక యువకుడు మరణించగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. స్థానికుల సమాచారం ప్రకారం అజ్మల్‌ వహోనియా (22), భారు మాతూర్‌ అనే ఇద్దరు యువకులను దొంగలుగా భావించిన గ్రామస్తులు దాదాపు 100 మంది ఆ ఇద్దరిపై  శనివారం రాత్రి దాడి చేయడంతో అజ్మల్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అజ్మల్‌, భారు మాతూర్‌ రెండు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలై బయటకువచ్చారు. బాధితులతో పాటు, దాడికి పాల్పడిన వారందరూ తూర్పు గుజరాత్‌కి చెందిన గిరిజనులు కావడం గమనార్హం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. శనివారం రాత్రి సుమారు 20 మంది గ్రామంలోకి ప్రవేశించారని, ఇందులో ఇద్దరిపై దాడి జరగగా మిగతా 18 మంది పరారైనట్లు పోలీసులు తెలిపారు. అయితే కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోపక్క ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.