గత సిరీస్ లో నిరాశపరచిన కోహ్లీ…ఈ సారి మాత్రం సత్తా చాటుతాడు: అజహరుద్దీన్

వాస్తవం ప్రతినిధి:  గత సిరీస్‌లో ఇంగ్లాండ్‌ గడ్డపై పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన విరాట్‌ కోహ్లీ.. ఈ సిరీస్‌లో తిరిగి సత్తా చాటుతాడని భారత మాజీ సారథి అజహరుద్దీన్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో కోహ్లీ ఆటతీరు పై మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ మాట్లాడుతూ….. ‘నాటి సిరీస్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం కోహ్లీ ఆటలో చాలా మార్పులు వచ్చాయి. అతను పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌లో అతనికిది తొలి పర్యటనే అయినప్పటికీ ఈసారి కచ్చితంగా బ్యాట్‌తో అద్భుతంగా రాణించగలడు. మరోవైపు సారథిగానూ ఇప్పటికే చాలా టెస్టులాడటంతో అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉండే అవకాశమే లేదు’ అంటూ అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. ఒకవేళ బంతి సీమ్‌ తిరిగితే ఇరు జట్లలోనూ బ్యాట్స్‌మెన్‌ తప్పకుండా ఇబ్బంది పడతారు. అయితే ఇంగ్లాండ్‌లో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ మాజీ ఆటగాడు చెప్పాడు.