ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర విభజన కు ఒప్పుకోము: యడ్యూరప్ప

వాస్తవం ప్రతినిధి: ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకోబోమని బీజేపీ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు,ప్రతిపక్ష నాయకుడు బీ ఎస్ యడ్యూరప్ప అన్నారు. కాకపోతే ప్రయోజనాల సాధనకు మాత్రం మద్దతిస్తాం అని ఆయన అన్నారు, బెంగళూరులో పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఉత్తర, దక్షిణ కర్ణాటక విభజన, సీఎం కుమారస్వామి పాలనపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కుమారస్వామి కర్ణాటక మొత్తానికి ముఖ్యమంత్రి అని, కానీ ఆయన మాత్రం 37 నియోజకవర్గాలకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రం విడిపోతే భవిష్యత్‌ తరాలు కుమారస్వామిని క్షమించవని అన్నారు. సీఎం కుమారస్వామి కుటుంబం కేవలం ఉత్తర కర్ణాటకను మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసిందని ఆయన విమర్శించారు. 75 ఏళ్ల సీనియర్‌ నాయకుడిగా ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి తాను ఒప్పుకోనని యడ్డి అన్నారు. అలానే ఆగస్టు రెండో తేదీన ఉత్తర కర్ణాటక బందుకు పిలుపునిచ్చిన ఉత్తర కర్ణాటక పోరాట సమితి ఇచ్చిన పిలుపుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.