ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కవిత

వాస్తవం ప్రతినిధి: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.ఈ తెల్లవారుజామున నాలుగున్నర గంటలనుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తొలి బోనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమర్పించారు. అనంతరం నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఆమె బంగారు బోనాన్ని తలకెత్తుకుని ఆలయంలోకి నడిచారు. 1008 మంది మహిళలు 1008 బోనాలతో కవిత తెచ్చిన బంగారు బోనానికి తోడుగా అనుసరించారు. కవిత వచ్చిన సమయంలో ఆలయం వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఊరేగింపులో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.