వ్యాపారాన్ని విస్తరింపజేసేందుకు చోక్సీ యాంటిగ్వా పౌరసత్వం

వాస్తవం ప్రతినిధి: వ్యాపారాన్ని విస్తరించేందుకే గతేడాది తాను యాంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ వెల్లడించినట్లు తెలుస్తుంది. ‘‘యాంటిగ్వా-బార్బుడా పౌరుడిగా నమోదు చేసుకునేందుకుగాను ‘పెట్టుబడి ద్వారా పౌరసత్వం’ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్నా. చట్టబద్ధంగా అవసరమైన ప్రక్రియలను పూర్తిచేశా. దీంతో నా దరఖాస్తు ఆమోదం పొందింది. కరేబియన్‌ దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించడం కోసమే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా’’ అని చోక్సీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  అయితే ఆ దేశ పాస్‌పోర్టు గనుక ఉంటే.. వీసా లేకుండా 132 దేశాలకు ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. అయితే భారత్‌లో బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయే ప్రణాళికలో భాగంగానే తాను యాంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను చోక్సీ ఖండించారు. ఈ ఏడాది జనవరిలో తాను చికిత్స నిమిత్తం అమెరికాలో ఉన్నానని తెలిపిన ఆయన అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. అందుకే యాంటిగ్వాలో ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. మరోపక్క చోక్సీ ఆచూకీ కోసం యాంటిగ్వా అధికారులకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే.