లారీ యజమానుల సమ్మె విరమణ

వాస్తవం ప్రతినిధి: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న లారీ యజమానులు గత రాత్రి నుంచి సమ్మె విరమించారు. కేంద్ర రవాణా శాఖ కార్యదర్శితో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించినట్లు ప్రకటించింది ఆలిండియా లారీ ఓనర్స్ సంఘం. డీజీల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సహా పలు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ దేశవ్యాప్తంగా లారీ యజమానులు సమ్మెకు దిగారు. ఇవాళ్టీతో సమ్మె ఎనిమిదవ రోజుకు చేరింది. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోవడంతో అన్ని రంగాలపై ప్రభావం పడింది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో అత్యవసర సేవలు నిలిపివేస్తామని లారీ ఓనర్స్ సంఘం హెచ్చరించింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర రవాణా శాఖ అధికారులు లారీ,ట్రక్కుయజమానుల సంఘంతో చర్చించింది. ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదరడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది లారీ ఓనర్స్ సంఘం. దీంతో ఈ అర్ధరాత్రి నుంచే లారీలు రోడ్డెక్కనున్నాయి.