రషీద్ ఎంపిక పై వస్తున్న విమర్శలపై స్పందించిన మాజీ ఆటగాడు

వాస్తవం ప్రతినిధి: కోహ్లీసేనతో జరిగే టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిని ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఇయాన్ బోథమ్ స్పందించారు. అతడిపై వస్తున్న విమర్శలు అనవసరమని అన్నారు. కొంత కాలంగా రషీద్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడకపోయినా టీమిండియాతో జరిగే తొలి టెస్టులో అతడిని ఎంపిక చేశారు. సెప్టెంబర్‌ నుంచి అతడు ఎరుపు బంతితో క్రికెట్‌ ఆడలేదు. అయినప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోవడంతో మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ ‘హాస్యాస్పదం’ అనగా, మరో సారథి నాసర్‌ హుస్సేన్‌ ‘కౌంటీ క్రికెట్‌’కు ఇది మంచిది కాదని కామెంట్లు చేశారు. దిగ్గజ ఆటగాడు ఇయాన్‌ బోథమ్‌ వీరి అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు. ‘మైకేల్‌ వాన్‌ ఎందుకలా అన్నాడో అర్థం కావడం లేదు. ఇప్పుడు అదంతా అర్ధరహితం. రషీద్‌ ఇప్పటికే దీనిపై స్పందించాడు. విమర్శించాడు. పత్రికల్లోనూ చాలా రాస్తున్నారు. కొందరు వ్యక్తులు తమ ప్రభావం చూపించేందుకు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో అని ఆశ్చర్యంగా ఉంటుంది. రషీద్‌ బాగా బౌలింగ్‌ వేస్తున్నాడు. అతడికి ఒక ప్రణాళిక ఉంది. దాన్నెప్పుడో సాధన చేసి ఉంటాడు’ అని బోథమ్‌ తెలిపారు. టీమిండియాతో జరిగిన చివరి వన్డేలో సారథి విరాట్‌ కోహ్లీని ఓ అద్భుతమైన బంతికి రషీద్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.