బ్రేగ్జిట్ పై పునరాలోచనలో పడ్డ బ్రిటన్ వాసులు

వాస్తవం ప్రతినిధి: మొన్నటివరకు ఈ యూ నుంచి బయటకి వచ్చేయాలని ఉవ్విలూరిన బ్రిటన్ వాసులు ఇప్పుడు మాత్రం దీనిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. చాలా మంది సీనియర్‌ రాజకీయ నాయకులు, మేధావులు యూరోపియన్‌ యూనియన్‌లోనే కొనసాగడం ఉత్తమం అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. దీనికోసం ‘ఫైనల్‌ సే’( తుదిమాట) పేరుతో యూరోపియన్‌ యూనియన్‌లో కొనసాగే అంశంపై మరో రెఫరెండం నిర్వహించాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది.మరోసారి రెఫరెండం నిర్వహించాలని ‘ది ఇండిపెండెంట్‌’ పత్రిక వినతిపై 48 గంటల్లో మొత్తం 3,00,000 మంది సంతకాలు చేశారు. అన్నిపార్టీల సీనియర్‌ నాయకులు దీనికి సానుకూలంగా ఉన్నారు. డెమొక్రటిక్‌ నాయకుడు విన్స్‌ కేబుల్‌, మాజీ మంత్రి జస్టిన్‌ గ్రీనింగ్‌, మరో నాయకుడు కరోలిన్‌ లూకస్‌ వంటి వారు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. బ్రిటన్‌ మాజీ డిప్యూటీ పీఎం నిక్‌ క్లెగ్‌ మాట్లాడుతూ ‘‘దీనికి కేవలం రాజకీయ నాయకుల నిర్ణయానికి వదిలేయలేం’’ అని అన్నారు. ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ కూడా ట్వీట్‌ చేయడం గమనార్హం. ఇక మాజీ అటార్ని జనరల్‌ డొమనిక్‌ గ్రివ్‌ మాట్లాడుతూ ‘‘మనం మరో అడుగు ముందుకు వేసే సమయంలో ఇది చాలా ఆలోచనతో కూడిన మార్గం’’ అని అన్నారు.