కోలుకున్న అశ్విన్…ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు!

వాస్తవం ప్రతినిధి: రెండురోజుల క్రితం స్వల్ప గాయం కారణంగా క్రికెట్ కు దూరమైన భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్ర అశ్విన్ కోలుకుంటున్నాడు. అంతేకాదండోయ్ ప్రాక్టీస్ సెషన్ లోనూ పాల్గొంటున్నాడు అశ్విన్. రెండు రోజుల క్రితం అశ్విన్‌ చేతికి స్వల్ప గాయమైంది. దీంతో అతడు ఎసెక్స్‌తో మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో రెండు రోజుల ఆటకు పూర్తిగా దూరంకావాల్సి వచ్చింది.గురువారం ఉదయం ప్రాక్టీస్ చేసే సమయంలో అశ్విన్‌ కుడి చేతికి గాయమైంది. అయితే అతణ్ని పరీక్షించిన టీమ్‌ ఫిజియో అది స్వల్ప గాయమే అని తేల్చాడు. ఇప్పటికే గాయాల కారణంగా భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఈ గాయం కారణంగా అనుభవం ఉన్న అశ్విన్‌ కూడా దూరం అవుతాడేమోనని అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. దీంతో అతడు గాయం నుంచి కోలుకున్నట్లుగా అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు ఆగస్టు 1న ప్రారంభంకానుంది.