ఇరాన్ యుద్ధం లోకి దిగితే అమెరికా సర్వం కోల్పోవాల్సి వస్తుంది: ఇరాన్ ఆర్మీ చీఫ్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల అమెరికా,ఇరాన్ ల మధ్య యుద్ద వాతావరణం నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల అధ్యక్షులు ఒకరిపై నొకరు హెచ్చరికలు జారీ చేసుకుంటూ ఒక రకంగా యుద్ద వాతావరణాన్ని తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖ్వాసీం సోలిమని కూడా అమెరికా ను హెచ్చరించారు. ఇరాన్‌ యుద్ధంలోకి దిగితే అమెరికా సర్వం కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 2015 లో కుదుర్చుకున్న ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇతర దేశాలు సైతం ఈ ఒప్పందం నుంచి వైదొలిగేలా అమెరికా పావులు కదుపుతోంది. అంతేగాకుండా, ఇరాన్‌పై భారీ ఆంక్షలు మోపింది. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దంటూ పలు దేశాలను కోరింది కూడా. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా కుట్రపన్నింది. ఈనేపథ్యంలో అమెరికా, ఇరాన్‌ మధ్య కొంతకాలంగా వార్‌ నడుస్తోంది. తాజాగా, ట్రంప్‌ వ్యాఖ్యలపై సోలిమని స్పందించారు. ఇరాన్‌ను కించపిరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.