విశేషంగా రాణిస్తున్న మరో మాజీ క్రికెటర్ వారసుడు

వాస్తవం ప్రతినిది: పండిత పుత్ర పరమాసుంథ అనే సామెత వినే ఉంటారు. కానీ క్రికెటర్ల సుపుత్రులు మాత్రం పండిత పుత్ర మహా పండిత అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ గురించి మనం చదివే ఉంటాం. అండర్‌-19 క్రికెట్‌లో తొలిసారి భారత్‌ తరఫున ఆడిన అర్జున్‌ వేసిన రెండో ఓవర్లోనే వికెట్‌ తీయడం, ఆ తర్వాత బ్యాట్‌తో కొంచం నిరాశ పరచినప్పటికీ కూడా విశేషంగా నే రాణించాడు. అయితే ఇప్పుడు మరో మాజీ క్రికెటర్‌ వారసుడు విశేషంగా రాణిస్తున్నాడు. అతడు మరెవరో కాదు భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్‌ ద్రవిడ్‌. 12 ఏళ్ల సమిత్‌ ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా కొట్టొనియాన్ షీల్డ్‌ అండర్‌-14 పోటీలను నిర్వహించారు. ఇందులో మాల్యా అదితి ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు ప్రాతినిధ్యం వహించిన సమిత్‌. అటు బ్యాట్‌తోనూ.. ఇటు బంతితోనూ రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం విశేషం. దీంతో కేంబ్రిడ్జ్‌ పబ్లిక్‌ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిత్‌ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సమిత్‌ తొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లను దక్కించుకున్నాడు. అండర్‌-14 బీటీడబ్ల్యూ కప్‌ టోర్నీలో శతకం సాధించడంతో సమిత్‌ తొలిసారి వార్తల్లోకి ఎక్కాడు. క్రికెటర్‌గా ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన ద్రవిడ్‌ ప్రస్తుతం అండర్‌-19, భారత్‌-ఎ పురుషుల జట్లకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మరి దేశానికి ప్రపంచ కప్ ని అందించిన ఆయన తనయుడి విషయంలో మంచి కోచ్ గా ఉండలేరా ఏంటి.