రషీద్ కు చోటు కల్పించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్

వాస్తవం ప్రతినిధి: పరిమిత ఓవర్ల సిరీస్‌లో బంతితో తిప్పేసిన స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌కు.. చోటు కల్పిస్తూ 13మంది సభ్యులతో కూడిన టెస్టు జట్టును ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తాజాగా ప్రకటించింది. అయితే భారత్‌లాగా తొలి మూడు టెస్టులకు కాకుండా.. ఇంగ్లాండ్‌ మొదటి టెస్టుకు మాత్రమే టెస్టు జట్టును ప్రకటించడం విశేషం.  అయితే తోలి టెస్ట్ మ్యాచ్ లో చాలాకాలంగా టెస్టులకు దూరమైన రషీద్‌ మళ్లీ చోటు దక్కించుకున్నాడు. ఇతను 2016 డిసెంబర్‌లో భారత్‌తోనే చివరి టెస్టు ఆడటం గమనార్హం. రషీద్‌తో పాటు ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కూడా తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌ పర్యటన అనంతరం అలీకి జట్టులో స్థానం దక్కడం మళ్లీ ఇప్పుడే. అయితే మరో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌కు మాత్రం నిరాశ తప్పలేదు. గాయం కారణంగా పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన వోక్స్‌కు కోలుకోవడానికి మరి కాస్త సమయం కేటాయిస్తున్నట్లు సెలక్షన్‌ కమిటీ పేర్కొంది. మరోవైపు కొంతకాలంగా కౌంటీల్లో నిలకడగా రాణిస్తున్న పాస్ట్‌ బౌలర్‌ జిమ్మే పోర్టర్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో అవకాశం కల్పించారు. పాస్ట్‌ బౌలర్లు జేమ్స్‌ అండర్సన్‌, స్టూవర్ట్‌ బ్రాడ్‌కు చోటు కల్పిస్తూ మొత్తంగా 13మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. తొలి టెస్టు బర్మింగ్‌హమ్‌లో ఆగస్టు 1న ఆరంభంకానున్న సంగతి తెలిసిందే.