ముగ్గురూ రండి.. ఇటు నేనొక్కడ్నే వుంటా.. మాట్లాడదాం! : పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి:  చంద్రబాబు, లోకేశ్, జగన్మోహన్ రెడ్డి గారికి.. వీళ్ల ముగ్గురికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. పశ్చిమగోదావరి జిల్లాపై ఓ డిస్కషన్ పెట్టండి. నేను వస్తాను.. మాట్లాడతాను. ఆ డిస్కషన్ భీమవరంలో జరగాలి. మీ ముగ్గురూ ఒకవైపు ఉండండి.. నేనొక్కడినే ఒకవైపు ఉంటాను’ అంటూ జనసేన పోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేశంగా  మాట్లాడారు.

నాకు రాజకీయ అనుభవం కంటే, ప్రజలకు ఏమైనా చేయాలనే ఆకాంక్ష బలంగా ఉంది. జనసేన ప్రశ్నించే పార్టీ మాత్రమే కాదు.. పాలించే పార్టీ కూడా. 2019 ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు అన్నింట్లో పాల్గొంటాం. అన్నపూర్ణగా పేరున్న పశ్చిమగోదావరి జిల్లా తాగునీరు లేక కొట్టుమిట్టాడుతోంది. ఇంకా జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. మరో నాలుగైదు రోజులు ఇక్కడే ఉండి సమస్యలపై అధ్యయనం చేస్తా  అన్నారు .

“గురుపూర్ణిమ రోజున శపథం చేస్తున్నా.. ఈ రాష్ట్రాన్ని జనసేన కైవసం చేసుకోబోతోంది. దానికి ఈ భీమవరం నుంచే బీజం పడుతుంది. రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా జన సైనికులు ఉంటారు.పార్టీ జెండా ఎగురుతుంది. నేను పబ్లిక్ పాలసీల గురించి అడిగితే.. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా మాట్లాడతారు..! అయినా సహిస్తాను.. బాంబులు.. వేటకొడవళ్లు.. బరిసెలు తెచ్చుకుంటారా మీ ఇష్టం.. గుండెల్లో రగిలే విప్లవ జ్వాల ముందు అవేమీ పని చేయవు.పశ్చిమ గోదావరి జిల్లాకు మీరేం చేశారు..? ఏం చేస్తారు?  ఆగస్టు 1 కి సర్పంచుల పదవీకాలం ముగిసిపోతుంది. పంచాయతీ ఎన్నికలు పెట్టండి.. జనసేన పాల్గొనకపోతే అప్పుడు అడగండి. కానీ.. ముఖ్యమంత్రి ఎన్నికలు పెట్టే పరిస్థితిలో లేరు. ఓడిపోతామని.. దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద పడుతుందని ఆయన భయం..నా వ్యక్తిగతం జోలికొస్తారా? మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే చాలా వున్నాయి.. యూనివర్సిటీలో తువ్వాలు కట్టుకుని మీరేం చేశారో బైట పెడతా..! నా దగ్గర వేల కోట్లు లేవు. సొంత మీడియా లేదు. చంద్రబాబును ఎదుర్కొనే శక్తి, ధైర్యం లేకే జగన్‌ అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం. చాలా మందికి వ్యక్తుల జీవితాల్లో కనిపించని పేజీలు ఉన్నాయి. ఎవరేం చేస్తున్నారో నాకు తెలిసినంతంగా కూడా పోలీసులకు తెలియదు’’ అని పవన్‌ అన్నారు.

  యనమదుర్రు డ్రెయిన్, తాగునీరు లేకపోవడం, ఆక్వా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడమని జగన్ కు చెబితే..ఆయన నన్ను తిడతారు.  నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడితే నన్నెవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు, లోకేశ్ లు వ్యాఖ్యలు చేస్తున్నారు.అన్నారు పవన్ ఆవేశంగా .