మరోసారి మీడియా పై విమర్శలు గుప్పించిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార సమయం నుంచి ఇప్పటివరకు కూడా మీడియాపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా తానూ ఎప్పుడు తప్పు చేస్తానా అని మీడియా కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ చూస్తుంది అని మీడియా పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. సీఎన్‌ఎన్ చానెల్‌కు చెందిన ఓ రిపోర్టర్‌ను వైట్‌హౌజ్‌లోకి రాకుండా నిషేధం విధించిన మరుసటి రోజే ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ కెమెరాలన్నింటినీ చూడండి. నేనెక్కడికి వెళ్లినా ఆ కెమెరాలు ఫాలో అవుతూనే ఉంటాయి. ఒబామాకు ఇలా ఎప్పుడూ జరగలేదు. బుష్‌కు ఎప్పుడూ జరగలేదు అని ఐయోవాలో తన మద్దతుదారుల సమావేశానికి వచ్చిన కెమెరా జర్నలిస్టులను చూపిస్తూ ట్రంప్ అన్నారు. నేనెప్పుడు తప్పు చేస్తానా అనుకుంటూ వాళ్లు నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు అని ట్రంప్ మీడియాపై మండిపడ్డారు.