భవనం పై నుంచి జలపాతాలు!

వాస్తవం ప్రతినిధి: వినూత్న కట్టడాలకు పెట్టింది పేరు చైనా నగరం. అలాంటి చైనా లో ఒక భవనం పై జలపాతాలను పెట్టారు. ఇది నమ్మలేకపోయినా నిజంగా ఇది మాత్రం నిజం. పచ్చని ప్రకృతి ఒడిలో కొండలు, కోనల నడుమ జలజల పారుతూ కిందకు దూకి సవ్వడి చేసే జలపాతాలను చూస్తుంటే ఎంతో కనువిందుగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఈ జలపాతాల అందాలు మరింత మనోహరంగా ఉంటాయి. మరి అలాంటి జల పాతాన్ని నగరం మధ్య భవనం పై పెట్టడం తో దానిని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరికొందరు అయితే మాత్రం డబ్బు వృధా అంటూ విమర్శలు చేస్తుండడం గమనార్హం. చైనాలోని గుయాంగ్‌ నగరంలో స్థానిక లుది ఇండస్ట్రీ గ్రూప్‌ ఓ భవన నిర్మాణం చేపట్టింది. షాపింగ్‌ మాల్‌, ఆఫీస్‌లు, లగ్జరీ హోటల్‌ ఏర్పాటుచేసేలా బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తోంది. అయితే అన్నింటిలా కాకుండా ఈ భవనం కాస్త విభిన్నంగా ఉండాలని లుది గ్రూప్‌ భావించింది. ఇందుకోసం భవనంపై నుంచి కృతిమ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 350 అడుగుల ఎత్తున ఉండే అంతస్తు నుంచి నీరు కిందకు దూకేలా నిర్మించారు. భవన నిర్మాణం ఇంకా పూర్తికాకపోయినా ఇప్పటికే ఈ జలపాత నిర్మాణం పూర్తవడంతో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ బిజీ నగరంలో ప్రజలకు ప్రకృతి రమణీయ భావన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ జలపాతాన్ని నిర్మించినట్లు లుది గ్రూప్‌ చెబుతోంది. అంతేగాక.. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కృతిమ జలపాతం కూడా ఇదేనని ఆ సంస్థ పేర్కొంటుంది కూడా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ జలపాతం స్థానికులను ఆకర్షించకపోవడం.  దీని వల్ల డబ్బు, నీటి వృథా తప్పించి ఇంకేమి లేదని స్థానికులు సోషల్‌మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ జలపాతం కోసం లుది గ్రూప్‌ గంటకు 120డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 8వేలు) ఖర్చు చేస్తోందట.