బాలివుడ్ స్టార్ కి క్రీడా పాఠాలు నేర్పిస్తున్న ధోనీ

వాస్తవం ప్రతినిధి: భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సహచర ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో ముందుంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి ధోనీ తన సలహాలను ఒక క్రికెటర్ తో కాదు  బాలివుడ్ హిరో తో పంచుకున్నాడు. ఇంతకీ ఆ హిరో ఎవరు అని అనుకుంటున్నారా. ధడక్ స్టార్ ఇషాన్ ఖట్టర్. తాజాగా వీరు ముంబయిలో కలిశారు. ఇద్దరూ కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతూ కనిపించారు. అంతేకాదు ధోనీ నుంచి ఇషాన్‌ ఫుట్‌బాల్‌ పాఠాలు కూడా నేర్చుకున్నాడు. కొంతమంది టీవీ స్టార్లు కూడా ధోనీతో కలిసి ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏటా బాలీవుడ్‌ స్టార్లు – క్రికెటర్ల మధ్య ఛారిటీ మ్యాచ్‌ నిర్వహించి, తద్వారా వచ్చే మొత్తాన్ని ఛారిటీకి ఇస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ప్రాక్టీస్‌ చేసినట్లుగా తెలుస్తోంది. క్రికెటర్లు ఆడే జట్టు పేరు ఆల్‌ హార్ట్స్‌ ఎఫ్‌సీ కాగా బాలీవుడ్‌ తారలు ఆడే జట్టు పేరు ఆల్‌ స్టార్స్‌ ఎఫ్‌సీ. ఆల్‌ స్టార్స్‌ ఎఫ్‌సీ జట్టుకు అభిషేక్‌ బచ్చన్‌ యజమాని. ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకుని తిరిగి భారత్‌ చేరుకున్న ధోనీ తన విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతున్నాడు. ఈ నేపధ్యంలోనే ఇటీవల కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ కుమార్తె పెళ్లి వేడుకకు ధోనీ కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యాడు.