పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలా సజీవ సమాధి అవుతానంటున్న వృద్దుడు

వాస్తవం ప్రతినిధి: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలా సజీవ సమాధి అవుతానంటున్నారు ఓ పెద్దాయన. అందుకు అనుమతి ఇవ్వాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌కు విన్నపం కూడా పెట్టుకున్నారు. మాచర్ల మండలం గన్నవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం..గడచిన పదేళ్లుగా ఆధ్యాత్మిక భావనలతో కుటుంబానికి దూరంగా ఉంటున్న తాతిరెడ్డి లచ్చిరెడ్డి ( 80 ) అనే వృద్దుడు ఈనెల 25న తనను దేవుడు సజీవ సమాధి కావాలని ఆజ్ఞాపించాడని చెబుతూ, పది అడుగుల లోతైన గుంతను నిర్మించి, దానిలోపలికి దిగేందుకు మెట్లు కట్టించుకుని, ఇనుప తలుపులు ఏర్పాటు చేశాడు. ఇక తనకు సమాధిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాశాడు. దీంతో లచ్చిరెడ్డి సమాధి ప్రవేశాన్ని అడ్డుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు అందాయి. మాచర్ల పోలీసులు గన్నవరం చేరుకుని లచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకుని, ఇటువంటి పనులు చట్ట వ్యతిరేకమని నచ్చజెప్పి, ఆయన ప్రయత్నాన్ని విరమించుకునేలా చేశారు.