పాక్ ఎన్నికల్లో పీటీఐ విజయం సాదించింది….కానీ!

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌ జాతీయ ఎన్నికల్లో మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ విజయం సాధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే విడుదలైన ఫలితాల ప్రకారం పీటీఐ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది కానీ, మ్యాజిక్ ఫిగర్ మాత్రం అందుకోలేకపోయింది. దీనితో ఇతర పార్టీ లతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఉదయం పాకిస్థాన్‌ ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన ఫలితాల ప్రకారం.. పీటీఐ పార్టీ 110 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 272 స్థానాల్లో ఎన్నికలు జరగగా ఇప్పటివరకు  251 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా చోట్ల లెక్కింపు కొనసాగుతోంది. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌ఎన్‌ పార్టీ 63 స్థానాల్లో గెలుపొందింది. బిలావల్‌ బుట్టో ఆధ్వర్యంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ 42సీట్లు దక్కించుకుంది. 21 చోట్ల ఇంకా ఫలితాలు వెల్లడికాలేదు. వీటిలో కొన్ని స్థానాల్లో పీటీఐ ముందంజలో ఉంది. అయినప్పటికీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 137 మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకోలేదు. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఖాన్‌కు మద్దతిచ్చే పలు చిన్న పార్టీలు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు. పాక్‌ స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ దూసుకెళ్తోన్నట్లు తెలుస్తుంది