దేశ రాజధానిలో ఆకలి బాధ తాళ లేక ముగ్గురు చిన్నారులు మృతి

వాస్తవం ప్రతినిధి: ఆకలి బాధ తాళ లేక ముగ్గురు మైనర్లు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే.. ఈ మైనర్లు దేశంలో మరెక్కడైనా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. దేశ రాజధానిలో ఉంటూ.. ఆకలి బాధ తట్టుకోలేక మరణించటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
సరైన ఆహారం అందక రెండేళ్లు, నాలుగేళ్లు, ఎనిమిదేళ్ల వయస్సున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయారు. ఢిల్లీలోని మండవాలిలో ఈ ఘటన జరిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జీటీబీ ఆసుపత్రిలో చేర్పించారు. పోషకాహారలేమి, ఆకలి కారణంగానే ముగ్గురు చిన్నారులు కన్నుమూశారని పోస్ట్ మార్టమ్ నివేదికలో తేలింది. దాదాపు 8 రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. బాలికల తండ్రి ఓ రిక్షా కార్మికుడు. రెండు రోజుల నుంచి అతను ఇంటికి రావడం లేదు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. చిన్నారుల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, క్షుద్బాధతోనే వారు మరణించారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చిన్నారుల కడుపు, బ్లాడర్‌, జీర్ణాశయ వ్యవస్థలు ఖాళీగా ఉన్నాయని పోస్ట్‌మార్టమ్‌ నివేదికలో వెల్లడైంది. చిన్నారులు డయేరియా కారణంగా వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ముగ్గురు చిన్నారుల ఆకలి మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమీషన్ నోటీసులు జారీ చేసింది.