తొలి సిక్కు-అమెరికన్ అటార్నీ జనరల్ పై జాతి వివక్ష తో కూడిన వ్యాఖ్యలు!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో తొలి సిక్కు-అమెరికన్‌ అటార్నీ జనరల్‌గా అరుదైన గౌరవం దక్కించుకున్న గుర్బీర్‌ గ్రేవల్‌పై జాతి వివక్ష తో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు ఇద్దరు రేడియో వ్యాఖ్యాతలు. తాము ఎక్కడ ఉన్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనే విషయం కూడా మరచి మరీ వారు వ్యాఖ్యలు చేశారు. రేడియోలో ఓ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన డెన్నిస్‌ మలోయ్‌, జూడి ఫ్రాంకో.. ఒక కేసు గురించి ప్రస్తావిస్తూ గ్రేవల్‌ను ‘టర్బన్‌ మనిషి’గా వ్యాఖ్యానించారు. పదే పదే ఆయన్ను టర్బన్ మనిషిగా పేర్కొన్నారు. తాము అలా పిలవడం ఇబ్బందిగా అనిపిస్తే.. టర్బన్‌ ధరించడం మానేయాలని గ్రేవల్‌కు సూచించారు. అప్పుడే ఆయన్ను పేరు పెట్టి పిలుస్తామంటూ వెకిలిగా నవ్వారు. దీనితో వారి వ్యాఖ్యలు, చేష్టలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.