తమిళనాట మరో భారీ బయోపిక్ కు రంగం సిద్దం

వాస్తవం సినిమా: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో బయోపిక్ క హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మహామహుల జీవితాలను ఆధారంగా చేసుకొని, వారి జీవిత కథల ఆధారంగా సినిమాలు నిర్మిస్తున్నారు. జీవితంలో జరిగే యదార్ధ సంఘటనలే కాబట్టి తప్పకుండా సినిమా నిలబడుతుందనే నమ్మకం దర్శక నిర్మాతలలో కనబడుతున్నది. అందుకే బయోపిక్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటె, ఎన్టీఆర్ కు సమకాలికమైన వ్యక్తి ఎంజీఆర్. ఆయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించడమే కాకుండా స్వయంగా పార్టీని స్థాపించి, తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఎంజీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయాలని గతంలో చాలామంది ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇన్నాళ్లకు అది సెట్ అయింది. ఏ బాలకృష్ణన్ అనే దర్శకుడు ఈ సినిమాను తీసేందుకు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన క్యాస్టింగ్ కూడా పూర్తయింది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సినిమాకు ఐదుగురు సంగీత దర్శకులు సంగీతాన్ని అందిస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం.