ఘనంగా గురు పౌర్ణిమ‌ వేడుకలు.. భక్తులతో కిక్కిరిసిన సాయి మందిరాలు

వాస్తవం ప్రతినిధి: నేడు గురు పౌర్ణిమ‌ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడీ సాయిబాబా మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. తెల్లవారుజాము నుంచే సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సద్గురువైన సాయిని దర్శించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని భక్తులు అంటున్నారు. భక్తుల ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా దేవాలయాల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
హిందూ సంప్ర‌దాయాలు పాటించే భార‌త‌దేశం, నేపాల్, ఇంకా బుద్ధ‌, జైన సంప్ర‌దాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణిమ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ రోజున ప్ర‌జ‌లు త‌మ ఆధ్యాత్మిక గురువుల‌ను స్మ‌రిస్తారు. పూజిస్తారు. బ‌హుమ‌తులు ఇస్తారు.గుడికి వెళ్లి ప్రార్థిస్తారు, దేవుళ్ల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. దేవుడిపై త‌మ‌కున్న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచేందుకు చేసే మ‌రో మార్గం ఉప‌వాసం ఉండ‌టం, గురువును పూజించి తాము మ‌రింత కాలం జీవించేందుకు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం తీసుకుంటారు.