గ్రహణాల కతీతంగా శ్రీకాళహస్తీశ్వరుడు!

వాస్తవం ప్రతినిధి: సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయంటే.. చిన్న పాటి ఆలయాల నుంచి దాదాపు అన్నీ ఆలయాలను కూడా మూసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా దినదిన ప్రవర్థమానం చెందుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం అందుకు అతీతంగా గ్రహణం ఏ సమయంలో వచ్చినా.. ఆ సమయంలో ఇక్కడి ఆలయాన్ని తెరచి ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. శుక్రవారం నాటి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ముక్కంటికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూర్య గ్రహణం అంటే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలోను, అదే చంద్రగ్రహణం అయితే గ్రహణం విడిచే సమయంలో ఇక్కడి ఆలయంలో కొలువుదీరిన శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. శుక్రవారం నాటి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి 1 గంటకు (శనివారం వేకువజామున) సంకల్ప పూజలు ప్రారంభించి ఉదయం 3 గంటల్లోపు అభిషేకాలు పూర్తి చేయనున్నారు. ఈ సమయంలో దర్శనార్థం వచ్చే భక్తులను ఆలయంలోనికి అనుమతించనున్నారు.