కోరుకుంటే ఒక్క నిమిషంలో సి ఎం అవుతా: హేమమాలిని

వాస్తవం ప్రతినిధి: తాను కోరుకుంటే నిమిషంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని బాలివుడ్ సీనియర్‌ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు.  గురువారం రాజస్తాన్‌లోని బాన్స్‌వారాలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…… ‘ నేను బంధీని కావాలనుకోవటం లేదు. నా స్వేచ్ఛ అంతటితో ముగిసిపోతుంది. ఒక వేళ ముఖ్యమంత్రి అయ్యేఅవకాశం నన్ను వెతుకుంటూ వస్తే తప్పకుండా అవుతాను. ఇప్పుడైతే ఆ ఉద్ధేశం లేదని ఆమె అన్నారు. హేమమాలిని సినిమాలకు కొద్దిగా దూరమైన తర్వాత రాజకీయాలలో బిజీ అయ్యారు. 1999లో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందించారు కూడా. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమె 2014లో బీజేపీ తరుపున ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి తన ప్రత్యర్థి జయంత్‌ చౌదరిపై అత్యథిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.