ఇమ్రాన్ ఖాన్ గెలుపు దేశ రాజకీయాలపై చెడు ప్రభావం చూపుతుంది: షరీఫ్

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌ ఎన్నికల్లో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ విజయం సాధించడం పట్ల మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా స్పందించారు. ఆయన గెలవడం దేశానికే కళంకమని అది దేశ రాజకీయాలపై చెడు ప్రభావం చూపుతుంది అని షరీఫ్ వ్యాఖ్యానించారు. పనామా పత్రాల కేసులో ఇటీవల 10 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్న షరీఫ్ ప్రస్తుతం అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నసంగతి తెలిసిందే. అయితే జైలు లో ఉన్న  షరీఫ్‌ను కలుసుకునేందుకు నిన్న పీఎంఎల్‌ఎన్‌ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్‌ ఎన్నికల ఫలితాల గురించి ఆరా తీశారు. పలు నియోజకవర్గాల్లో పీఎంఎల్‌ఎన్‌ నేతలు ఘోర పరాజయం పొందారని, ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పార్టీ నేతలు ఘన విజయం సాధించినట్లు షరీఫ్‌కు వారు తెలియజేశారు. పీఎంఎల్‌ఎన్‌ నేతలకు మంచి పట్టు ఉన్న ఫైసలాబాద్‌, లాహోర్‌, రావల్పిండి ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు ఓడిపోయి ఇమ్రాన్‌ ఖాన్‌ అభ్యర్థులు గెలవడంపై ఆయన విమర్శలు చేశారు. 2013 సార్వత్రిక ఎన్నికల్లో ఖాన్‌ పార్టీ పేలవ ప్రదర్శన కనబరిచి, ఇప్పుడు అఖండ విజయం సాధించడం నమ్మశక్యంగా లేదని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశానికే కళంకమని, ఖాన్‌ గెలవడం దేశ రాజకీయాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని షరీఫ్ అన్నారు. ఆడియాలా జైలు లో ఉన్న షరీఫ్ ను కలుసుకునేందుకు నేతలకు ప్రతి గురువారం అనుమతి ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్న షరీఫ్ పార్టీ నేతలు కొందరు జైలు లో ఉన్న షరీఫ్ ని కలవడానికి వెళ్లారు. ఈ నేపధ్యంలోనే షరీఫ్ పై వ్యాఖ్యలు చేశారు.