ఇద్దరు భారతీయులకు రామన్ మెగసెసే అవార్డులు

వాస్తవం ప్రతినిధి: రామన్ మెగసెసే పురస్కారం ఈ ఏడాది ఆరుగురికి లభించింది. వీరిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో వచ్చే నెల 31న ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2018వ సంవత్సరానికి ఆరుగురు ‘హీరోస్ ఆఫ్ హోప్’ ను ఎంపిక చేసినట్లు రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ ప్రకటించింది. భారతదేశానికి చెందిన భరత్ వాట్వానీ, సోనమ్ వాంగ్‌చుక్ లకు రామన్ మెగసెసే అవార్డు లభించింది.

1988లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు డాక్టర్ భరత్ వత్వానీ, ఆయన భార్య. దీని ముఖ్యఉద్దేశం.. వీధుల్లో తిరిగే మానసిక వ్యాధిగ్రస్తులను చేరదీసి వారికి ఉచితంగా వసతి కల్పించి చికిత్స చేయించడం. మామూలు పరిస్థితికి చేరుకున్నాక వాళ్లను కుటుంబాల చెంతకు చేర్చుతున్నారు. మానసిక వికలాంగులను గుర్తించడానికి సామాజిక కార్యకర్తలు, పోలీసుల సహకారం తీసుకుంటూ తమ సేవను కొనసాగిస్తున్నారు.
సోను వాంగ్‌చుక్.. 1988లో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడాఖ్‌ (ఎస్ఈసీఎంఎల్) స్థాపించి ఆ ప్రాంతంలోని విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. 1994లో ఆపరేషన్ న్యూ హోప్ అనే కొత్త ప్రాజెక్టును ప్రారంభించాడు. దీనిద్వారా 700 మంది ఉపాధ్యాయులకు, 1000 వీఈసీ లీడర్లకు శిక్షణ ఇప్పించి.. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని 2015 నాటికి 75 శాతానికి తీసుకొచ్చారు.