అరుదైన గౌరవం అందుకున్న కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్-భారత్ ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో టీమిండియా చెమ్స్ ఫర్డ్ వేదికగా ఎసెక్స్ జట్టుతో వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. అయితే ఈ సన్నాహ మ్యాచ్ లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లాండ్‌కు చెందిన క్రికెట్‌ ఫ్యాన్‌ క్లబ్‌ ప్రముఖ బార్మీ ఆర్మీ నుంచి ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకుంది. ‘2017, 18సంవత్సరాలకు గానూ బార్మీ ఆర్మీ కోహ్లీకి ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను అందించిందంటూరాసుకొచ్చింది. గతేడాది కోహ్లీపై ఈ క్లబ్‌ ఓ వీడియో రూపొందించింది. మరోపక్క మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఆరంభంలో తడబడినప్పటికీ కెప్టెన్‌ కోహ్లీ(68; 93బంతుల్లో 12×4), ఓపెనర్‌ మురళీ విజయ్‌(53; 113బంతుల్లో 7×4)తో కలిసి ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌(82 బ్యాటింగ్‌; 94బంతుల్లో 14×4), కేఎల్‌ రాహుల్‌(58; 92బంతుల్లో 12×4), హార్ధిక్‌ పాండ్య(33బ్యాటింగ్‌; 58బంతుల్లో 6×4) కూడా రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 322పరుగులు చేసింది.