సైకిల్ పై నుంచి కిందపడ్డ తేజ్!

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్ పై నుంచి పడిపోయారు. పెరిగిన పెట్రోల్,డీజిల ధరలకు నిరసన గా పాట్నా లో ఆర్జేడీ ఆధ్వర్యంలో తేజ్ ప్రతాప్ ఈ రోజు  సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ నేపధ్యంలో పార్టీ కార్యకర్తల తో పాటు తేజ్ ప్రతాప్ కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎరుపు రంగు టోపీ, నీలం రంగు టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించిన తేజ్ ప్రతాప్ యాదవ్.. సైకిల్‌పై స్పీడ్‌గా వెళ్తున్నారు. ఆయన వెంట సెక్యూరిటీ కూడా పరుగెడుతుంది. బైక్‌లపై పోలీసులు ఆయనకు రక్షణగా వెళ్తున్నారు. తేజ్ సైకిల్‌కు సమాంతరంగా వెళ్తున్న మరో వాహనం ఆయన సైకిల్‌ను ఢీకొట్టడం తో తేజ్ సైకిల్‌పై నుంచి కింద పడిపోయారు. దీనితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పైకి లేపారు. ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ…… పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతున్నందున ప్రత్యామ్నాయంగా సైకిల్‌పై వెళ్లడం ఉత్తమమని ఆయన చెప్పారు. సైకిల్‌పై వెళ్లడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదన్నారు తేజ్‌ప్రతాప్ యాదవ్. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన తేజ్ ప్రతాప్ యాదవ్.. మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.