శాకంబరీ అలంకారంలో అమ్మలగన్నయమ్మ అనుగ్రహం

వాస్తవం ప్రతినిధి: విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. బుధవారం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో సరస్వతి యాగం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గామల్లేశ్వర స్వామి వార్లతో పాటు కొండపై ఉన్న అన్ని ఉపాలయాల్లో దేవతామూర్తులను కాయగూరలతో అలంకరిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో అమ్మవారిని అలంకరించేందుకు భక్తులు పూలదండలకు బదులుగా ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసిన దండలను సమర్పించి పూజలు నిర్వహించుకుంటారు.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు అమ్మవారి ఆలయాన్ని అలంకరించేందుకు సుమారు 40 టన్నుల కూరగాయలు, ఆకుకూరలను వినియోగించనున్నారు. కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆకుకూరలు, కాయగూరలు దేవస్థానానికి చేరాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు ఘాట్ రోడ్డు, మహా మండపం, రాజగోపురం, పరిసర ప్రాంతాలను కూడా ఆకుకూరలతో అలంకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి కదంబం ప్రసాదాన్ని పంపిణి చేసేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.