వైఎస్ ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా పరిపాలన చేస్తా: జగన్

వాస్తవం ప్రతినిధి: వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పెద్దాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కాంట్రాక్టర్లతో కమీషన్ గురించి మాట్లాడేందుకే ముఖ్యమంత్రి ప్రతి సోమవారం పోలవరం వెళుతున్నారని… ప్రాజెక్ట్‌లో అంతులేని అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అవినీతి కారణంగా పోలవరం పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ దగ్గరకి వచ్చి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తానంటారని ఆయన మాటలు నమ్మవద్దని.. మనస్సాక్షిని నమ్మి ఓటేయాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. నాన్న ప్రజల కోసం ఒకడుగు ముందుకేస్తే.. నేను రెండడుగులు ముందుకేస్తానని.. వైఎస్ ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా పరిపాలన చేస్తానని ప్రకటించారు. దేవుడి ఆశీర్వాదం, ప్రజల దీనెనలతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి, అధికారంలోకి వస్తే ఒక్క మందు షాపు కూడా లేకుండా చేస్తానని హామీ యిస్తున్నానని అన్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా ఉండమని ప్రాధేయపడుతున్నాను’ అని జగన్ అన్నారు.