ఫాన్స్ కు పవన్ విన్నపం!

వాస్తవం ప్రతినిధి: వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహన్‌రెడ్డి ఇటీవ‌ల జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ప‌వ‌న్‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశాడు. కార్లను మార్చినంత తేలిగ్గా పవన్‌కల్యాణ్ పెండ్లాలను మారుస్తాడు. ఇప్పటికే నలుగురిని మార్చాడు. ఇలాంటి వ్యక్తి మాటలకు కూడా మనం సమాధానం చెప్పాలంటే విలువలు ఎక్కడున్నాయి? అంటూ పవన్‌ను జగన్ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ప‌వ‌న్ అభిమానులు జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్‌పై త‌మ ఆగ్ర‌హాన్ని వెళ్ళ‌గ‌క్కారు. ఈ క్ర‌మంలో అభిమానుల‌కి ప‌వ‌న్ త‌న విన్న‌పాన్ని ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ ఈ వివాదంలోకి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ఆడపడుచులను, కుటుంబ సభ్యులను లాగవద్దని విన్నవించారు.

“ఈ మధ్యన జగన్ మోహన్ రెడ్డి నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లను. అది రాజకీయ లబ్ది కోసం అసలు వాడను. ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తాను కానీ, నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ తరుణంలో ఎవరన్నా జగన్ మోహన్ రెడ్డిని కానీ, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కానీ, వారి ఇంటి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. ఈ వివాదాన్ని దయచేసి అందరూ ఇక్కడితో ఆపివేయాల్సిందిగా నా ప్రార్థన” అని పోస్టు పెట్టారు.