పాక్ జాతీయ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు…..ఓటమి పాలైన మాజీ ప్రధానులు!

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌ జాతీయ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలుచోటుచేసుకుంటున్నాయి.  గురువారం వెలువడుతున్న ఫలితాల్లో మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తోన్నట్లు తెలుస్తుంది.  మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ నేతలు వరుసగా ఓటమి ని చవిచూడాల్సి వస్తుంది. తాజా ఎన్నికల్లో ప్రధాని రేసులో ఉన్న ఇద్దరు అభ్యర్థులతో పాటు ఇద్దరు మాజీ ప్రధానులూ ఓడిపోవడం గమనార్హం.  పాక్‌ మాజీ అధ్యక్షుడు జర్దారీ, మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కుమారుడు, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ.. కరాచీ సౌత్‌ నుంచి పోటీ చేసి ఓడిపోగా, మరోపక్క ఈ ఎన్నికల్లో పీటీఐకి పోటీగా ఉన్న పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన షాబాజ్‌ షరీఫ్‌ కూడా ఓటమిపాలయ్యారు. కరాచీ వెస్ట్‌ నుంచి ఆయన పోటీ చేశారు. పీఎంఎల్‌-ఎన్‌ పార్టీకి మాజీ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే పనామా పత్రాలు వెల్లడించిన అక్రమాస్తుల వ్యవహారంలో ఆయన జైలుకు వెళ్లడంతో పార్టీ బాధ్యతలు నవాజ్‌ సోదరుడైన షాబాజ్‌ షరీఫ్‌ చేపట్టారు. అలానే పాకిస్థాన్‌ మాజీ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ముల్తాన్‌లోని షుజాబాద్‌ నియోజకవర్గంలో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ) అభ్యర్థి మహమ్మద్‌ ఇబ్రహీంపై పీపీపీ తరఫున పోటీ చేసిన గిలానీ ఓటమి పాలయ్యారు. గిలానీ 2008 నుంచి 2012 వరకు పాకిస్థాన్‌ ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే.  ఇకపోతే, నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటు పడటంతో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ కూడా పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో అబ్బాసీ రావల్పిండి నుంచి పోటీ చేయగా ఆయన ఓటమిని చవిచూశారు. అబ్బాసీ 2017 ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది మే నెలలో అబ్బాసీ ప్రధాని పదవి నుంచి వైదొలగడంతో ఆపద్ధర్మ ప్రధానిగా నస్రుల్‌ ‌ ముల్క్‌ బాధ్యతలు చేపట్టారు.