పాక్ ఎన్నికల పై స్పందించిన థరూర్!

వాస్తవం ప్రతినిధి: పాక్ ఎన్నికల పై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. పాక్ లో నిన్న జరిగిన జాతీయ ఎన్నికల్లో పాకిస్తాన్ తెహ్రిక్-ఈ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ విజయం దిశగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో థరూర్ మీడియా తో మాట్లాడుతూ….పాకిస్థాన్‌లో ఆర్మీ మద్దతు తెలుపుతోన్న ఇమ్రాన్‌ ఖాన్‌ గెలిచినా పాక్‌-భారత్‌ మధ్య ఉన్న బంధం విషయంలో ఎటువంటి ప్రభావం చూపదని వ్యాఖ్యానించారు. ‘ఇమ్రాన్‌ ఖాన్‌లో మనం రెండు రకాల స్వభావాలను చూశాం. పాక్‌ ఎన్నికల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. మరోవైపు లండన్‌, న్యూఢిల్లీ లో ఆయన పర్యటించినప్పుడు ఎంతో ఉదార స్వభావాన్ని ప్రదర్శించారు. పాక్‌-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశాలు ఉండకపోవచ్చు’ అని అన్నారు. పాక్‌ ఎన్నికల ఫలితాలపై మరింత విస్తృతంగా మాట్లాడుతూ ‘‘ఆయన విజయం ఊహించిందే. పాక్‌లో మార్పు రావాలని అక్కడి మిలిటరీ కోరుకుంటోంది. నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పార్టీని తమ దేశంలో అధికారంలో ఉండకుండా చేయాలని ప్రయత్నించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ అయితేనే తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని భావించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్‌ ఖాన్‌.. స్వతంత్ర అభ్యర్థులతో పాటు చిన్న పార్టీలు, మిలిటరీకి అనుకూలంగా ఉండి వారి సూచనలు తీసుకునే ముత్తాహిదా మజ్లిస్‌-ఈ-అమల్‌ (ఎంఎంఏ) పార్టీ సాయం కూడా తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో తమ సూచనలను పాటించకపోతే ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీకి ఎంఎంఏ పార్టీ మద్దతు ఉపసంహరించుకునేలా మిలిటరీ చేస్తుంది’ అన్నారు శశిథరూర్‌ అన్నారు.