భగత్ సింగ్ ప్రాణ త్యాగమే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: భీమవరంలో విద్యార్థులతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం సమావేశమయ్యారు. పవన్‌ మాట్లాడుతూ..భగత్ సింగ్ ప్రాణ త్యాగమే నాకు స్ఫూర్తి అన్నారు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడినని అన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు తట్టుకోలేరని, పారిపోతారని మండిపడ్డారు.‘చంద్రబాబు, జగన్ లాంటి వాళ్లు రాజ్యాంగం రాయలేరు. అంబేద్కర్ లాంటి మహానుభావుడికే రాజ్యాంగం రాయగలిగే విజ్ఞానం ఉంటుంది. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్లకే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే.. ప్రజా సంక్షేమం కోసం నిలబడే నాకు ఎంత తెగింపు ఉండాలి? చూడ్డానికి పవన్ కల్యాణ్ మెత్తగా కనిపిస్తాడు కానీ, తేడా వస్తే తోలు తీస్తాడు. ఎవరి వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితిలో ఏం జరిగిందో ఎవరికి తెలుసన్నారు. ఎన్ని కష్టాలు, బాధల మధ్య సంఘటనలు జరుగుతాయో వాళ్లకి తెలుసా అని ప్రశ్నించారు. రాజకీయాలు చేయడానికి పెట్టి పుట్టనక్కర్లేదని, సహనం, తెగింపు, బలమైన సంకల్పం కావాలని అన్నారు. నేను నారా లోకేశ్‌లాగా కంఫర్ట్‌ జోన్‌ నుంచి రాజకీయాల్లోకి రాలేదని విమర్శించారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకొస్తున్నాననే భయంతోనే టీడీపీ, వైసీపీ, బీజేపీ అందరూ నన్ను తిడుతున్నారు’ అని అన్నారు.