కార్గిల్ దివస్ సందర్భంగా యుద్ద వీరులకు నివాళులు అర్పించిన మోదీ

వాస్తవం ప్రతినిధి: కార్గిల్‌ దివస్‌ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌ యుద్ధ వీరులకు నివాళులర్పించారు. పాకిస్థాన్‌పై కార్గిల్‌‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించి నేటికి 19 సంవత్సరాలు పూర్తయిన నేపధ్యంలో ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా యుద్ద వీరులకు వందనం చేశారు. ‘కార్గిల్‌ యుద్ధ సమయంలో పనిచేసిన సైనికులందరికీ ఈ దేశం కృతజ్ఞతలతో అంజలి ఘటిస్తోంది. సాహసవంతులైన మన సైనికులు భారతదేశం సురక్షితమని రుజువు చేశారు. దేశంలోని శాంతియుత వాతావరణాన్ని నాశనం చేయాలనుకున్న వారికి తగిన బుద్ధి చెప్పారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. అలానే యుద్ధ సమయంలో భారత ప్రధానిగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయిపై కూడా మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘కార్గిల్‌ యుద్ధ సమయంలో అద్భుతమైన రాజకీయ నాయకత్వాన్ని అందించిన అటల్‌ జీని భారత్‌ ఎల్లప్పుడూ సగర్వంగా గుర్తు చేసుకుంటుంది అని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేశాన్ని ఆయన ముందుండి నడిపించారాణి,సైన్యానికి మద్దతిచ్చారు ప్రపంచం ముందు భారత వైఖరిని స్పష్టంగా చూపించారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు.