‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో కైకాల పాత్ర ఇదే..

వాస్తవం సినిమా: నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. విద్యాబాలన్, నరేష్ వి.కె, మురళీశర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఎక్కడా రాజీ లేకుండా చిత్రంలో భారీ తారాగణాన్ని ఎంచుకున్నాడు బాలయ్యబాబు. చిత్రంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన కీలక వ్యక్తులను, కీలక సన్నివేశాలను చూపించనున్నారు.చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు (జులై 25) సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను తెలుపుతూ డైరెక్టర్ క్రిష్ ట్వీట్ చేశారు. లెజెండరీ దర్శకులు హెచ్‌ఎం.రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించనున్నారని పేర్కొని.. ఆ పాత్ర పిక్ జతచేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కాళిదాసు’, ‘భక్తప్రహ్లాద’ లాంటి చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకి పునాది వేసిన పితామహుడు హెచ్‌ఎం రెడ్డి. అలాంటి లెజెండరీ పాత్రను మాహానటుడు కైకాల సత్యనారాయణ అమోఘమైన పద్ధతిలో రంజింపజేశారని దర్శకుడు క్రిష్ తెలిపారు.