ఉత్తర ప్రదేశ్ లో దారుణం…ఇద్దరు వ్యాపార వేత్తలను కాల్చి చంపిన దుండగులు

వాస్తవం ప్రతినిధి: ఉత్తర ప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎవరో గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యాపార వేత్తలను కాల్చి చంపినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ కోహండవుర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. శ్యాంసుందర్ జైశ్వాల్ (55), శ్యామ్ మురత్ జైశ్వాల్ (48)ల ను బైకు పై వచ్చిన కొందరు దుండగులు వారిపై కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. భవన నిర్మాణ సరుకుల వ్యాపారంలో ఉన్న ఇద్దరు వ్యాపారులకు దుండగులు కొన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. అయితే డబ్బు ఇవ్వకపోవడంతో వారిపై ఈ విధంగా దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది.  వ్యాపారవేత్తల హత్యలతో స్థానికులు అలాహాబాద్-ఫైజాబాద్ రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి కలగజేసుకుని ఈ ఘటనలో నిందితులను పట్టుకుని, వారిని శిక్షిస్తామని హామీనిచ్చారు.